Congress RajyaSabha: వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీలను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్‌కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకాలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్ శుక్లా (చత్తీస్‌గఢ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్ గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. మరో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చాలేదు. పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో ముకుల్ వాస్నిక్, వివేక్ టంకాలకు రాజ్యసభ అవకాశం లభించడం గమనార్హం.
అంతకుముందు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాల నుంచి 16 మందికి రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలోనే వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి.