తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాద మరణాలు.. రోజుకు 426 మంది బలి - రోడ్డు ప్రమాదాలు రిపోర్ట్

ROAD ACCIDENTS NCRB: దేశంలో రోడ్డు ప్రమాద మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021లో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అయితే గాయపడ్డ వారి సంఖ్య కాస్త తగ్గింది.

ROAD ACCIDENTS NCRB
ROAD ACCIDENTS NCRB

By

Published : Sep 5, 2022, 8:09 AM IST

Updated : Sep 5, 2022, 9:09 AM IST

ROAD ACCIDENTS NCRB: దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రోడ్డు ప్రమాదాల కారణంగా 2021లో ఏకంగా 1.55లక్షల మంది మృత్యుఒడికి చేరారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది మరణిస్తుండగా, ఒక్కరోజులో 426మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలే కాకుండా గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.03 లక్షల ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) నివేదిక పేర్కొంది. 'భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు-2021' కింద ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదికను విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య గతేడాది గరిష్ట స్థాయికి చేరుకోగా.. గాయపడిన వారి సంఖ్య మాత్రం గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గిందని నివేదిక తెలిపింది.

లాక్‌డౌన్‌లో కాస్త తక్కువగా..
2020లో దేశవ్యాప్తంగా 3.54 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.33లక్షల మంది మృతిచెందారు. 3.35లక్షల మంది గాయపడ్డారు. అయితే, అప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా యాక్సిడెంట్ల సంఖ్య కాస్త తక్కువగా నమోదైంది.అంతకుముందు ఏడాది(2019)లో 4.37 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించడం గమనార్హం. ఈ యాక్సిడెంట్లలో 1.54లక్షల మంది చనిపోగా.. 4.39లక్షల మంది క్షతగాత్రులైనట్లు నివేదిక పేర్కొంటోంది. 2018లో 4.45 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.52 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ద్విచక్రవాహనదారులే అధికం
'సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులే ఎక్కువ మంది ఉంటారు. కానీ మిజోరం, పంజాబ్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం క్షతగాత్రుల కంటే.. మరణించినవారి సంఖ్యే అధికం' అని నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదాల్లో మరణించినవారిలో అధిక భాగం (44.5శాతం) ద్విచక్ర వాహనదారులేనని ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కార్లు (15.1), ట్రక్కుల (9.4) ప్రమాదాల్లో ప్రయాణించినవారు ఉన్నారు. ద్విచక్రవాహనాల కంటే బస్సుల వంటి ప్రజా రవాణా మార్గాల్లోనే ప్రయాణించడం మంచిదని ఎన్‌సీఆర్‌బీ సూచించింది. ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే 59.7శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు కూడా వివరించింది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు వెల్లడించింది.

Last Updated : Sep 5, 2022, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details