జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గుప్కార్ నేతలు కోరారు. ఎన్నిరోజులు పట్టినా ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రానికి, కశ్మీర్‌కు ఏర్పడిన దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 పునురుద్ధరణ కోసం తమ పార్టీ పోరాడుతుందని నేషనల్ కాన్ఫరెన్సు అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దిల్లీలో ప్రధానమంత్రితో సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"జమ్ముకశ్మీర్ ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్రం జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునురుద్ధరించేందుకు కృషి చేయాలి."
-ఫరూఖ్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్సు అధ్యక్షుడు.
పునరుద్ధరించాల్సిందే..
రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను జమ్మకశ్మీర్ ప్రజలు ఎంత మాత్రం అంగీకరించరని ఈ సమావేశంలో మోదీకి తాను చెప్పానని పీడీపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. నెలలు లేదా సంవత్సరాల సమయం పట్టినా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
"రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యాయుతంగా, శాంతియుతంగా జమ్ముకశ్మీర్ ప్రజలు పోరాడుతారు. నెలలు, సంవత్సరాలు పట్టినా.. ఆర్టికల్ 370 పునురద్ధరణ జరగాల్సిందే. ఎందుకంటే అది మా గుర్తింపు. దానిని మేం పాకిస్థాన్ నుంచి తెచ్చుకోలేదు. జవహార్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ కృషి ద్వారా ఈ దేశం మాకు కల్పించింది."