జూన్ 28 నుంచి మొదలవనున్న అమర్నాథ్ యాత్రకు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న.. పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్ముకశ్మీర్ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు సంబంధించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
అమర్నాథ్ యాత్ర కోసం మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి కారణంగా.. గతేడాది ఈ యాత్రను రద్దు చేశారు.