దేశంలో చిన్నారుల కోసం కరోనా టీకా తెచ్చేందుకు మరో సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం 2 నుంచి 17ఏళ్ల మధ్య వయసు చిన్నారులను నియమించుకునే ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది. దిల్లీలోని హమ్‌దార్ద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో వీటిని నిర్వహిస్తున్నారు.
920మంది పిల్లలపై
చిన్నారులపై ప్రయోగాల్లో భాగంగా మొత్తం 920మంది పిల్లలపై వీటిని ప్రయోగించనున్నారు. ఇందులో 460 మంది 2 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు కాగా మరో 460 మందిని 12 నుంచి 17 ఏళ్ల వయసున్న చిన్నారులను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కొవావాక్స్ ప్రయోగాలను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఇక 12 నుంచి 18 ఏళ్ల పిల్లలు వినియోగించేలా భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.