తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాగాలాండ్​ ఎన్నికలకు రంగం సిద్ధం.. 59 స్థానాలకు పోలింగ్​.. బరిలో 183 మంది - nagaland 2018 result

సోమవారం జరగనున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 59 స్థానాలకు 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13 లక్షల మంది ఓటర్ల కోసం 2,351 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్​డీపీపీ, భాజపా కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్​పీపీ, ఎన్సీపీ, జేడీయూ పార్టీలు తమ పార్టీల తరఫున అభ్యర్థులను పోటీలో నిలిపాయి.

nagaland assembly election 2023
నాగాలాండ్ శాసనసభ ఎన్నికలు 2023

By

Published : Feb 26, 2023, 6:07 PM IST

నాగాలాండ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు రంగం సిద్ధమైంది. మొత్తం 60 స్థానాలకు గానూ 59 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానం ఏకగ్రీవమైంది. 183 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్‌లో మొత్తం 13 లక్షల మంది ఓటర్ల కోసం 2,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ అగ్రనేతలు తమ పార్టీ తరఫున ప్రచారాన్ని హోరెత్తించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ సర్కారును నడిపిస్తున్న నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డీపీపీ), భాజపా పొత్తుతో ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఎన్‌డీపీపీ 40, భాజపా 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. అకులుటో శాసనసభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఖేకషీ సుమి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం వల్ల భాజపా అభ్యర్థి కజేటో కినిమి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికలు జరగకుండానే బీజేపీ ఒక స్థానాన్ని ఖాతాలో వేసుకుంది.

కాంగ్రెస్ 23 , నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్​పీఎఫ్​) 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్సీపీ అభ్యర్థులు 12 చోట్ల పోటీ చేస్తుండగా.. ఆర్పీపీ 1, జేడీయూ 7, ఎల్జేపీ 15, ఆర్పీఐ 9, ఆర్జేడీ 3, స్వతంత్రులు 19 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది.

నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో.. ఉత్తర అంగామి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నెఫ్యూ రియోపై కాంగ్రెస్ సెయివిలీ చాచును బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత యంతుంగో పాటన్‌.. త్యుయ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా రాష్ట్ర చీఫ్ టెంజెన్ ఇమ్నా అలోంగ్.. అలోంగ్టాకీ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మార్చి 2న నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​పీఎఫ్ 26, బీజేపీ 12, ఎన్​డీపీపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్​డీపీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details