మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్లో కరోనా విజృంభణకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేంద్రం సూచనలను మహరాష్ట్ర ప్రభుత్వం పాటించిందని తెలిపారు. ఆపై పరిస్థితికి తగ్గట్లుగా చర్యలు తీసుకుందని వివరించారు. వైరస్ వ్యాప్తి విషయంలో రాష్ట్రాలను నిందించటం కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.
"మహారాష్ట్రతో పాటు మిగతా రెండు రాష్ట్రాలు(ఛత్తీస్గఢ్, పంజాబ్).. వైరస్ను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని భావిస్తే.. ఆ ఓటమి తొలుత కేంద్రానిదే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మొదటి నుంచి కరోనా మహమ్మారిపై దేశం పోరాడుతోంది. భాజపా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లోంచి వైరస్ అదృశ్యమైందా? వ్యాక్సిన్లను, రెమిడెసివర్ను మహారాష్ట్రకు కేంద్రం సమకూర్చాలి. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రెమిడెసివర్ ఔషధం దొరుకుతోంది. కానీ, మహారాష్ట్రలో మాత్రం అందుబాటులో లేదు."
- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ