వరసకు బావ అయిన ఓ పోలీస్ అధికారి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తరచూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపిన ఆ యువతి కొద్ది రోజులకే ట్విస్ట్ ఇచ్చింది. అసలేమైందంటే..?
వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని చల్లకేరెకి చెందిన సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్(సీపీఐ) ఉమేశ్‌పై ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తరచూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని యువతి ఆరోపించింది. ఫలితంగా తనకు ఐదు సార్లు అబార్షన్ అయ్యిందని తెలిపింది. దీంతో అధికారులు నిందితుడిని విధుల నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరో వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కంగుతినడం పోలీసుల వంతైంది.
నిందితుడు ఉమేశ్ తనపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. మానసిక ఒత్తిడి కారణంగానే తాను ఇలా ఫిర్యాదు చేశానని యువతి చెప్పుకొచ్చింది. ఉమేశ్ ఆ యువతికి బావ అవుతాడని తెలుస్తోంది. అయితే ఉమేశ్‌కు ఇదివరకే రెండు వివాహాలు జరిగాయి. ఈ యువతిని ఇప్పుడు మూడో భార్యగా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ఐదేళ్ల క్రితం దావణగెరె పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. యువతి కుటుంబ సభ్యులు ఓ భూవివాదాన్ని పరిష్కరించాలని ఉమేశ్‌ను ఆశ్రయించారు. అయితే మేనమామ కుమారుడైన ఉమేశ్.. చిత్రదుర్గ నుంచి దావణగెరెకు తనను పిలిపించి అత్యాచారానికి పాల్పడేవాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఒకవేళ తాను వెళ్లకపోతే.. అతడే తన దగ్గరికి వచ్చి అత్యాచారం చేసేవాడని వివరించింది. తన మాట వినకపోతే దావణగెరెలో తమకు ప్లాట్ రాకుండా అడ్డుకుంటానని సీపీఐ బెదిరించినట్లు తెలిపింది.