దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవలగానూ రామోజీ ఫిల్మ్ సిటీకి పురస్కారం దక్కింది. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్లో నిర్వహించిన దక్షిణ భారత హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వార్షిక సమ్మేళనంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్ని అవార్డులను ప్రదానం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరి కార్యక్రమానికి హాజరై పురస్కారాన్ని అందుకున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీకి ఉత్తమ ఆతిథ్య పురస్కారం.. సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎండీ విజయేశ్వరి - ramoji film city awards
దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవలగానూ రామోజీ ఫిల్మ్ సిటీకి పురస్కారం దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరి.
"రామోజీ ఫిల్మ్ సిటీ తరపున ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం గొప్ప గౌరవం. 20ఏళ్ల క్రితం మా ఛైర్మన్ రామోజీరావు ఫిల్మ్‌సిటీని నిర్మిస్తానని చెప్పారు. అది వివిధ వర్గాలకు గమ్యస్థానంగా ఉంటుందన్నారు. అప్పుడు అది చాలా మందికి అసాధ్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ నేడు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆతిథ్యంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీంతో మేము ఆయన కలను నెరవేర్చామని నమ్ముతున్నాం. దీన్ని ఇలాగే కొనసాగించడానికి మేము మరింతగా కృషి చేస్తాం. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచుతుంది. అవార్డుల కమిటీకి, ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి చెప్పుకొచ్చారు.
పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సిహ్రా ప్రకటించింది. దక్షిణాదికి చెందిన 19 హోటళ్లు, రిసార్ట్‌లకు వివిధ విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. సిహ్రా అధ్యక్షుడు శ్యామ్ రాజు.. ముఖ్యమంత్రి బొమ్మైను సత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి పర్యాటక శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు.