తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సక్రమంగానే అయోధ్య భూ కొనుగోళ్లు- పదేళ్ల రికార్డులు ఇవే'

అయోధ్యలో భూమి కొనుగోలు అంశంపై వివాదాలు తలెత్తిన వేళ రామ జన్మభూమి ట్రస్టు సంపూర్ణ వివరణ ఇచ్చింది. గత పదేళ్లలో ఆ భూమి క్రయవిక్రయాలపై కుదిరిన ఒప్పందాలను వెల్లడించింది. పూర్తి పారదర్శకంగానే భూమి కొనుగోలు జరిగిందని స్పష్టం చేసింది.

Ram temple trust issues clarification on allegations of fraud
సక్రమంగానే అయోధ్య భూ కొనుగోళ్లు

By

Published : Jun 15, 2021, 4:56 PM IST

అయోధ్యలో భూమి కొనుగోలులో అవినీతి జరిగిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర టస్టు మరోసారి వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. భూమి కొనుగోలులో జరిగిన పరిణామాలను సవివరంగా వెల్లడించారు.

భూమి ధర మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువ అని తెలిపారు. తాము ఆ భూమిని చదరపు అడుగుకు రూ.1,423కు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతోనే నెట్​బ్యాంకింగ్ ద్వారా లావాదేవీ జరిపినట్లు చెప్పారు. ఆ భూమికి సంబంధించి ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందాలు ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. వాటిని పరిష్కరించిన తర్వాత భూమిని ట్రస్టు కొనుగోలు చేసిందని వివరించారు.

చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఒప్పందం జరిగిందిలా...

  • ఈ భూమిని కొనేందుకు రామ్ జన్మభూమి న్యాస్ ఆసక్తి చూపించింది. కానీ యాజమాన్య హక్కులపై స్పష్టతకు వచ్చేందుకు అంతకుముందు జరిగిన ఒప్పందాలను పూర్తి చేయాలని భావించింది. గత పదేళ్లలో ఈ ఒప్పందంలో 9 మంది వ్యక్తులకు ప్రమేయం ఉంది. అందులో ముగ్గురు ముస్లింలు.
  • వీరందరినీ సంప్రదించి చర్చలు జరిపాం. అందరూ తమ అంగీకారంతో ఒక దగ్గరికి చేరి, గతంలోని ఒప్పందాలపై చర్చలు జరిపారు. అవన్నీ పూర్తైన తర్వాత.. చివరకు యాజమాన్య హక్కులు దక్కించుకున్నవారితో ట్రస్టు తుది ఒప్పందం చేసుకుంది. ఇదంతా వేగంగా అయిపోయింది. కానీ పూర్తి పారదర్శకంగా జరిగింది.
  • ట్రస్టు నిర్వహించే అన్ని ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో కాకుండా ఆన్​లైన్ మాధ్యమం ద్వారానే జరపాలని ఇదివరకే నిర్ణయించాం. ఇప్పటికే మూడు, నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాం. ఇందులో మందిరాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఇకపైనా కొనుగోళ్లు కొనసాగిస్తాం.
  • ప్రతి ఆశ్రమం/మందిరం/ప్రైవేటు ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు పునరావాసం కోసం వారి ఎంపిక మేరకు భూమిని కేటాయించి, భవన నిర్మాణాలకు తగినన్ని నిధులు అందించాలన్నది ట్రస్టు నిర్ణయం. ఇందుకు సంబంధించిన ప్రతి లావాదేవీ రికార్డుల్లో ఉంది.

ఒప్పందం వివరాలు:

  1. అయోధ్యలోని బర్వారి టోలాకు చెందిన ముహమ్మద్ ఆలం తనయులు మెహ్​ఫూజ్ ఆలం, జావెద్ ఆలం, నూర్ ఆలం, ఫిరోజ్ ఆలం గాటా నెంబర్ 242, 243, 244, 246లోని స్థలాన్ని విక్రయించేందుకు 2011 మార్చి 4న కుసుమ్ పాఠక్, హరీష్ పాఠక్, మహమద్ ఇర్ఫాన్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం విలువ కోటి రూపాయలు. మూడేళ్ల వరకు చెల్లుబాటయ్యేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం 2014 మార్చి 4న రద్దైయింది.
  2. 2017 నవంబర్ 20న మెహ్​ఫూజ్ ఆలం సహా పైన పేర్కొన్న ముగ్గురు కలిసి.. కుసుమ్ పాఠక్​, హరీష్ పాఠక్​లకు సేల్​ డీడ్​ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ఒప్పందం పై గాటా నెంబర్లలోని 2.334 హెక్టార్ల స్థలానికి సంబంధించినది. ఈ ఒప్పందం విలువ రూ.2 కోట్లు.
  3. 2017 నవంబర్ 21న కుసుమ్ పాఠక్, హరీష్ పాఠక్​ ఈ నాలుగు గాటాల స్థలాన్ని ఇచ్ఛ రామ్ సింగ్, జితేంద్ర కుమార్ సింగ్, రాకేశ్ కుమార్ సింగ్​కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీని విలువ రూ.2.16 కోట్లు. ఈ ఒప్పందం 2019 సెప్టెంబర్ 17న రద్దైంది.
  4. 2019 సెప్టెంబర్ 17న కుసుమ్ పాఠక్, హరీష్ పాఠక్ మరో ఒప్పందంలోకి చేరారు. ఈ స్థలాన్ని విక్రయించేందుకు ఇచ్ఛ రామ్ సింగ్, విశ్వ ప్రతాప్ ఉపాధ్యాయ్, మనీశ్ కుమార్, సుబేదార్ బలరాం యాదవ్, రవీంద్ర కుమార్ దూబే, సుల్తాన్ అన్సారీ, రషీద్ హుస్సేన్​తో అంగీకారం కుదుర్చుకున్నారు. ఒప్పందం విలువ రూ.2 కోట్లు. దీని గడువు మూడేళ్లు. వీరి మధ్య కుదిరిన ఈ ఒప్పందం 2021 మార్చి 18న రద్దైంది.
  5. 2021 మార్చి 18న గాటా నెంబర్ 243, 244, 246లో ఉన్న 1.2080 హెక్టార్ల స్థలాన్ని రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ(ఇర్ఫాన్ కుమారుడు)కు సేల్​ డీడ్ ద్వారా కుసుమ్ పాఠక్, హరీష్ పాఠక్ విక్రయించారు. ఒప్పందం విలువ రూ.2 కోట్లు. సర్కిల్(కనిష్ఠ) రేటు ప్రకారం ఈ భూమి ధరను రూ.5.80 కోట్లుగా నిర్ణయించారు. రూ.5.80 కోట్లుక స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
  6. అదే రోజు రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ.. ఈ భూమిని విక్రయించేందుకు రామజన్మభూమి ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ రూ.18.50 కోట్లు. రూ.17 కోట్లను ఆన్​లైన్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేశారు ట్రస్టు సభ్యులు.

ఇదీ చదవండి:అయోధ్య ఆలయ భూమిపై వివాదం- అవినీతి నిజమేనా?

ABOUT THE AUTHOR

...view details