Ram Naam Bank in Ajmer :రాజస్థాన్‌లోని అజ్మేర్లో ఓ వింత బ్యాంక్ ఉంది. ఇందులో నగదు లావాదేవీలు జరపడానికి బదులుగా రామనామాలు సేకరిస్తారు. 1987 ఏప్రిల్ 7న ప్రారంభమైన ఈ బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 280 శాఖలు ఉండగా, మొత్తం 55వేల మంది ఖాతాదారులు ఉన్నారు. రాజస్థాన్‌లోనే ఐదు ప్రాంతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఖాతా తెరవగానే ఓ పాస్‌బుక్‌ను అందజేస్తారు. ఆ తర్వాత ఖాతాదారుడికి 84 లక్షల రామనామాలు రాసే పుస్తకాన్ని పోస్ట్‌లో పంపిస్తారు. అవి తిరిగి వచ్చాక వాటిని పరిశీలించి ఖాతాలో జమచేస్తారు. ప్రతి పుస్తకంలో 25 వేల రామనామాలు రాసే వీలు ఉంటుంది. ఇలా 84 లక్షల రామనామాలు రాసేందుకు సుమారు 330 పుస్తకాలు అవసరమవుతాయి.
బ్యాంక్‌లో ఉన్న 55 వేల ఖాతాదారుల్లో ఇప్పటివరకు 2వేల మంది 84 లక్షల రామనామాలు రాశారు. మరో 70 మంది 84 లక్షల రామానామాలను రెండు సార్లు రాశారు. ఇదే సమయంలో 10 మంది మూడు సార్లు 84 లక్షల రామానామాలను పూర్తి చేశారు. ఈ ఖాతాదారుల రికార్డులను రిజిస్ట్రర్లతో పాటు కంప్యూటర్లలో కూడా నమోదు చేస్తారు. ఖాతాదారుడి మరణానంతరం వారి వారసులు వచ్చినా రికార్డులు ఉంటాయని బ్యాంక్ నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంక్ రోజువారీ నిర్వహణ కోసం ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.
"గీతా ప్రెస్ డైరెక్టర్ రామ్ సుఖ్ దాస్ మహారాజ్ ఆధ్వర్యంలో అజ్మేర్లో రామ్ నామ్ దాన్ సంగ్రహ్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇందులో 55వేల మంది ఖాతాదారులు రామానామాలు రాస్తున్నారు. వారి రికార్డులను ఇక్కడే భద్రపరుస్తాము. 2012లో బ్యాంక్‌లో షార్ట్ సర్క్యూట్ తలెత్తి అగ్నిప్రమాదం జరిగింది. కానీ ఒక్క పుస్తకం కూడా కాలిపోలేదు. పుస్తకాలును కాపాడేందుకు పెట్టిన వస్త్రాలు కాలినా, కాపీలు మాత్రం దగ్ధం కాలేదు. బ్యాంక్‌లో చాలా ఎలుకలు ఉన్నాయి. కానీ ఏరోజు రామనామాల పుస్తకాలకు హానీ చేయలేదు. ఇది మరో అద్భుతం."
--రామ్ సింగ్, బ్యాంక్ మేనేజర్