నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 19 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ ఛైర్మన్ ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు తక్షణమే సభను వీడాలని సూచించారు.
సస్పెండ్ అయిన సభ్యుల్లో సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్ ఉన్నారు. ముగ్గురు తెరాస ఎంపీలు సైతం ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున.. సభను తొలుత 20 నిమిషాలు, తర్వాత మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. తిరిగి సమావేశం అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడని నేపథ్యంలో బుధవారానికి రాజ్యసభను వాయిదా వేశారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో అత్యధికులు టీఎంసీ, డీఎంకే సభ్యులే. కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరు కూడా లేరు. సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లడం వల్ల.. రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు ఎవరూ లేరు.
'మోదీ భయపడుతున్నారు'
అయితే, సభ్యుల సస్పెన్షన్‌ను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారని మండిపడింది. పార్లమెంట్ కార్యకలాపాలను ప్రభుత్వమే అడ్డుకుంటోందని, విపక్షాలు కాదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ఆరోపించారు. "పార్లమెంట్‌ను చీకటి గదిగా మార్చేశారు. పార్లమెంట్ అంటే ప్రధాని మోదీ భయపడుతున్నారు. మోదీ ప్రతి గురువారం అరగంట సేపు పార్లమెంట్‌కు వస్తున్నారు. దీన్ని 'గుజరాత్ జింఖానా' స్టేడియం అని ఆయన భావిస్తున్నారు. ఆయన సభకు వచ్చి ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పాలి" అని డెరెక్ చెప్పుకొచ్చారు.
'చర్చలకు సిద్ధమే'
అయితే, సభ్యులను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం బరువైన హృదయంతో తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సభాపతి అభ్యర్థనలను పదేపదే నిర్లక్ష్యం చేశారని, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో చర్చ నుంచి ప్రభుత్వం పారిపోవడం లేదని, విపక్షాలే చర్చకు భయపడుతున్నాయని అన్నారు. "ద్రవ్యోల్బణాన్ని ఇతర దేశాల కంటే గొప్పగా నియంత్రించాం. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యలను పార్లమెంట్ వేదికగా వివరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నిర్మలా సీతారామన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ధరల పెరుగుదల అంశంపై చర్చిద్దాం" అని గోయల్ వివరించారు.
లోక్‌సభలో సోమవారం కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సస్పెండ్ అయ్యారు. ధరల పెరుగుదల అంశంపై నిరసనలు చేస్తూ లోక్‌సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారిని.. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని లోక్‌సభ తీర్మానించింది. మాణిక్కం ఠాకూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: