Grandfather Grandson diploma: ఏదైనా సాధించాలన్న తపనకు అభిరుచి తోడైతే.. వయసుతో నిమిత్తం లేకుండా అద్భుతాలు చేయడం ఖాయం. ఈ సూత్రాన్నే నమ్ముకున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తి, 14 ఏళ్ల బాలుడు.. డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు.
ఆ భావాలే నడిపించాయ్..
రాజస్థాన్ బాన్స్వాడ జిల్లా భగత్ సింగ్ కాలనీలో నివసించే రిటైర్డ్ ఉపాధ్యాయుడు శరద్ చంద్ర వ్యాస్‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఏదైనా అర్చకత్వ కోర్సు చేయాలని ముందునుంచీ భావించేవారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం వల్ల ఇన్నాళ్లూ కుదరలేదు. దీంతో పదవీ విరమణ చేశాక.. 'గోవింద్ గురు ట్రైబ్స్ యూనివర్శిటీ'లోని వేద విద్యాపీఠంలో డిప్లొమాలో చేరిపోయారు. అంతేగాక, ఆయన మనవడు హెనిల్ వ్యాస్‌ను కూడా ఈ కోర్సు చేసేలా ప్రోత్సహించాడు.
Ritual exams Rajasthan
హెనిల్ వ్యాస్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేసమయంలో తన తాతయ్యతో కలిసి అర్చకత్వ కోర్సులో చేరాడు. రెండింటినీ ఒకేసారి చదివేందుకు తాతయ్య సహకరించేవారు. కాలేజీకి వెళ్లి తాను విన్న క్లాసులను రాత్రి సమయాల్లో మనవడికి నేర్పించేవారు శరత్ చంద్ర. ఆ విధంగా అర్చకత్వ కోర్సును ఇరువురూ అభ్యసించారు.
ఇంత కష్టపడి చదువుతున్న వీరిద్దరూ.. రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. దీనితో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శరద్ చంద్ర వ్యాస్ 300 మార్కులకు 268 మార్కులు సాధించగా.. అతని మనవడు హెనిల్ 234 మార్కులు తెచ్చుకున్నాడు.