రాజస్థాన్ కిషన్పోల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ కాగ్జీ తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గంలోని నలుగురు వైద్యులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ జైపుర్‌లోని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్సాది లాల్ మీనా నివాసం వద్ద అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు అమీన్ కాగ్జీ. మంత్రి కాసేపటి తర్వాత బదిలీలపై ఆలోచిస్తానని హామీ ఇవ్వగా ధర్నాను విరమించారు అమీన్. అధికార పార్టీ ఎమ్మెల్యేను మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే: రాజస్థాన్‌లోని కిషన్పోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అమీన్ కాగ్జీ. ఆయన నియోజకవర్గంలోని నలుగురు వైద్యులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా బదిలీ చేశారు. నలుగురు వైద్యులను బదిలీ చేయవద్దని శుక్రవారం కోరినప్పటికి మంత్రి వారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ బదిలీ తన నియోజకవర్గంలోని ప్రజల ఆగ్రహానికి కారణమైందన్నారు. మంత్రి నుంచి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడం వల్లే ధర్నాకు దిగానని తెలిపారు. మంత్రి లాల్మీనా.. ఎమ్మెల్యే అమీన్‌తో చర్చించి బదిలీల విషయంపై ఆలోచిస్తానని హామీ ఇచ్చిన కాసేపటి తర్వాత ఆందోళనను విరమించారు.
"నలుగురు వైద్యుల బదిలీపై నా నియోజకవర్గ ప్రజల్లో ఆగ్రహం ఉంది. వైద్యుల బదిలీకి నేను అనుకూలం కాదని మంత్రికి చెప్పా. అయినప్పటికీ వారిని బదిలీ చేశారు. ప్రజలు ఉదయాన్నే తన నివాసానికి వచ్చి ఈ విషయమై మంత్రితో మాట్లాడాలని కోరారు"