తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంటి చికిత్స కోసం ఆస్పత్రికి.. పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

పంటి నొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యాపారి.. వార్తా పత్రిక చదువుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Rajasthan businessman dies
వ్యాపారవేత్త మరణం

By

Published : Nov 7, 2022, 10:50 PM IST

ఇటీవల ఘజియాబాద్‌లో జిమ్‌ ట్రైనర్‌ కుర్చీలోనే ప్రాణాలు వదిలిన ఘటన మరువకముందే అలాంటి తరహాలోనే మరో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. రాజస్థాన్‌లో బడ్మేర్‌లో ఓ వ్యాపారి వార్తా పత్రిక చదువుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. శనివారం ఉదయం 10గంటలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మృతి చెందిన వ్యాపారిని దిలీప్‌ కుమార్‌‌ మదాని (61)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే..వస్త్ర వ్యాపారం చేసే దిలీప్‌ కుమార్‌ పంటి నొప్పి రావడంతో వైద్యుడిని కలిసేందుకు క్లీనిక్‌కు వెళ్లారు. అయితే, వైద్యుడిని కలిసేందుకు తన వంతు కోసం వేచి చూస్తున్న ఆయన బెంచ్‌పై కూర్చొని వార్తా పత్రిక చదివారు. అకస్మాత్తుగా అసౌకర్యానికి గురై అలా కొన్ని క్షణాలు ఆగిపోయిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్న క్లినిక్‌ సిబ్బంది హుటాహుటిన అతడి వద్దకు చేరుకొని సాయం అందించేందుకు ప్రయత్నించినా.. చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు.

వస్త్ర వ్యాపారి అయిన దిలీప్‌ కుమార్‌ గుజరాత్‌లోని సూరత్‌లో నివాసం ఉంటున్నారు. ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 4న బడ్మేర్‌కు వచ్చారు. పంటి నొప్పి ఉండటంతో నవంబర్‌ 5న ఆయన వైద్యుడిని కలిసేందుకు వచ్చారు. అయితే, వైద్యుడిని కలవడానికి ముందు స్పృహ కోల్పోయిన ఆయన నేలపై కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై డాక్టర్‌ కపిల్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఆ కుటుంబ సభ్యులతో మొదట మాట్లాడకుండా దీనిపై తానేమీ చెప్పలేనన్నారు. కుప్పకూలిపోయిన అతడిని ట్యాక్సీలో ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తమ సిబ్బంది చెప్పారన్నారు. దిలీప్‌ కుమార్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

గుండెపోటు కావొచ్చేమో..: మృతుడి సోదరుడు
శనివారం ఉదయం దిలీప్‌ కుమార్‌ బాగానే ఉన్నారని.. అలా కుప్పకూలిపోవడానికి కారణమేంటో తెలియడంలేదని అతడి సోదరుడు మహేంద్ర మదాని అన్నారు. బహుశా గుండెపోటు కావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. ఈ విషాదం గురించి తెలిసి కుటుంబ సభ్యులంతా బడ్మేర్‌కు చేరుకున్నారని.. శనివారమే అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన వివరించారు.

గతంలో ఇలాంటి షాకింగ్‌ ఉదంతాలివే..
ఇటీవలి కాలంలో దేశంలోని పలు చోట్ల ఇలాంటి దురదృష్టకర ఘటనలు నమోదు కావడం తీవ్ర కలవర పెడుతోంది. అక్టోబర్‌ మాసంలో యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జిమ్‌ ట్రైనర్‌ తాను కూర్చున్న కుర్చీలోనే అలా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. అలాగే, గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో దేవీ శరన్నవరాత్రుల వేడుకల సమయంలో 21 ఏళ్ల యువకుడు గార్బా నృత్యం చేస్తూ కుప్పకూలిపోయాడు. సెప్టెంబర్‌ నెలలో జమ్మూలో 20 ఏళ్ల యోగేశ్‌ గుప్తా అనే నృత్య కళాకారుడు పార్వతి వేషధారణలో స్టేజిపైనే ప్రదర్శన చేస్తుండగానే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దీంతో పాటు యూపీలోని బరేలిలో ఓ పుట్టినరోజు వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ 48 ఏళ్ల ప్రభాత్‌ కుమార్‌ అనే వ్యక్తి సైతం ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది.

ఇవీ చదవండి:పాములు దరిచేరని అతిపెద్ద గడ్డి కార్పెట్​ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన సిసోదియా అనుచరుడు

ABOUT THE AUTHOR

...view details