Rajasthan Accident News Today : రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును వాహనం ఢీకొనడం వల్ల ఆరుగురు పోలీసులు మరణించారు. పోలీసులంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కల్పించేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుజన్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తారానగర్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు భద్రత కల్పించేందుకు పోలీసులు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆగి ఉన్న ట్రక్కును వీరి వాహనం ఢీకొట్టింది. దీంతో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.
నుజ్జునుజ్జయిన పోలీసుల వాహనం సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతి చెందిన పోలీసులను ఏఎస్‌ఐ రామచంద్ర, కానిస్టేబుళ్లు కుంభారం, సురేశ్ మీనా, థానరామ్, మహేంద్రగా గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. "ఈరోజు తెల్లవారుజామున.. చురులోని సుజన్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరణించిన పోలీసుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు
Nainital Accident News : ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో రెండు రోజుల క్రితం.. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లోయలోకి దూసుకెళ్లింది ఓ పికప్ వ్యాన్. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పికప్ వ్యాన్ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్-రీతా సాహిబ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
Uttarakhand Accident News : అధికారులు వచ్చేలోపు.. గ్రామస్థులే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇంతలో అధికారులు వచ్చి గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.