Raj Thackeray loudspeaker: మసీదులపై లౌడ్ స్పీకర్లు ఈ నెల నాలుగో తేదీ నుంచి మూగబోయేలా చేయాలంటూ వివాదాస్పద పిలుపునిచ్చిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఠాక్రే పాల్గొన్న సభను నిర్వహించినవారిపైనా కేసు పెట్టారు. ఈ నెల ఒకటో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన సభలో ఠాక్రే మాట్లాడుతూ.. మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించని పక్షంలో బుధవారం నుంచి వాటి ఎదురుగా హనుమాన్ చాలీసా వినిపించాలని ప్రజల్ని కోరారు. ఆ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్షానంతరం పోలీసు విభాగంలో సెలవుల్ని తాత్కాలికంగా రద్దుచేశారు. పలుచోట్ల ఎంఎన్‌ఎస్ కార్యకర్తల్ని అరెస్టు చేయడం ప్రారంభించారు.
14 ఏళ్ల క్రితం నాటి కేసులో..:ఠాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ 2008లో నమోదైన కేసులో ఆయనపై బెయిల్‌కు వీల్లేని వారెంటును మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో న్యాయస్థానం జారీ చేసింది. జూన్ 8లోగా ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ముంబయి పోలీసుల్ని ఆదేశించింది.