మధ్యప్రదేశ్ రైల్వే అధికారులు దేవుడికే నోటీసులిచ్చారు. హనుమంతుడి పేరు మీద విడుదలైన ఈ నోటీసులో.. రైల్వే శాఖకు చెందిన భూమిని ఆక్రమించారని అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఖాళీ చేయకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీబీ సహా కూల్చివేతకు అయ్యే ఖర్చులు కూడా వసూళు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఝాన్సీ రైల్వే డివిజన్ అధికారులు జారీ చేసిన వింత నోటీసు పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నోటీసు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
'వారం రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేయాలి'.. హనుమంతుడికి అధికారుల నోటీసులు - దేవుడికి రైల్వే అధికారుల నోటీసులు
రైల్వేశాఖకు చెందిన భూమిని ఆక్రమించారని హనుమంతుడికే నోటీసులిచ్చారు అధికారులు. వారం రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
రైల్వే భూమిలో హనుమాన్ ఆలయం..
మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో అధికారులు కొత్తగా రైల్వేలైన్‌ను నిర్మిస్తున్నారు. గ్వాలియర్-షియోపుర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైన్లో ఓ హనుమాన్ ఆలయం ఉంది. ఆ గుడి.. రైల్వే శాఖకు చెందిన భూమిలో ఉందని.. అందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖకు చెందిన భూమిని హనుమంతుడు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
"హనుమంతుడి పేరు మీద నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఈ నోటీసు జారీచేశారు. ఫిబ్రవరి 8న నోటీసు విడుదలైంది. వాస్తవానికి ఆలయ యజమానికి నోటీసు ఇవ్వాలి. కానీ చిన్న పొరపాటు వల్ల హనుమంతుడికి అధికారులు నోటీసు ఇచ్చారు." అని ఝాన్సీ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ మాథుర్ తెలిపారు.