కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
కేరళలో 22, 23వ తేదీల్లో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నారు రాహుల్. రెండురోజుల పర్యటనలో భాగంగా.. కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రచారవేగాన్ని పెంచిన రాహుల్.. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు.
ప్రాంతీయ సమస్యలే అజెండా..
తన ఎన్నికల ప్రచారంలో రాహుల్.. ప్రాంతీయ సమస్యలను ఎత్తిచూపనున్నారు. ఇంతకుముందు తమిళనాడు పర్యటన సందర్భంగా భావోద్వేగాలతో ముడిపడిన సున్నిత అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా భాషా సమస్యలు సహా.. నూతన విద్యావిధానంపై భాజపాను విమర్శించారు. అంతకుముందు తమిళనాడు పర్యటనలో.. నూతన విద్యా విధానం, భాషా సమస్యపై భాజపాపై విమర్శలు గుప్పించారు. అసోంలో సీఏఏను ప్రస్తావించిన రాహుల్.. భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
బంగాల్లో విడిగానే..?
అసోంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ప్రారంభించారు. త్వరలో బంగాల్లోనూ కాంగ్రెస్ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే బంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలసి నిర్వహించే సంయుక్త ర్యాలీకి రాహుల్ హాజరవుతారా? లేదా కాంగ్రెస్ ప్రచారాన్ని రాహుల్ విడిగా ప్రారంభిస్తారా అనేదానిపై స్పష్టత లేదు. అయితే.. ఆరోజు రాహుల్ తమిళనాడు ప్రచారంలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు కేరళలో రాహుల్ గాంధీ ప్రచార ర్యాలీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని గహ్లాత్కు మంచి పేరుంది.
ఇక కేరళ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ రాష్ట్రానికి చేరుకున్నారు. సుమారు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తారిఖ్ పర్యటించి, క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు.
ఇదీ చదవండి:పెట్రో ధరలు తగ్గించాలని మోదీకి సోనియా లేఖ