Rahul Gandhis Doctored Video: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించిన కేసులో ఓ న్యూస్ యాంకర్ 'అరెస్టు'.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియోల వ్యవహారంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న యాంకర్ రోహిత్ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు రాయ్‌పుర్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ వెళ్లారు. అయితే ఈ అరెస్టును అడ్డుకున్న యూపీ పోలీసులు.. రంజన్‌ను తమతో పాటు తీసుకెళ్లడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్ గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. అయితే ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ హంతకులను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ టీవీ ఛానల్ యాజమాన్యం, యాంకర్ రోహిత్ రంజన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాయ్‌పుర్‌లో కేసు పెట్టారు.
దీంతో రంజన్‌ను అరెస్టు చేసేందుకు ఈ ఉదయం రాయ్‌పుర్ పోలీసులు గాజియాబాద్ చేరుకున్నారు. రంజన్ నివాసానికి వెళ్లి అతడిని ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా.. గాజియాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. రాయ్‌పుర్ పోలీసులు అరెస్టు వారెంట్ చూపిస్తున్నప్పటికీ.. యూపీ పోలీసులు బలవంతంగా రంజన్‌ను తీసుకొని వెళ్లిపోయారు. దీంతో అతడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అతడు ఓ రహస్య ప్రాంతంలో యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ వెల్లడించారు.