Rahul Gandhi tweet: కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రచారాలపైనే దృష్టి పెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల్ని తరలించడంపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోపించారు. చైనా సమస్య, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి పతనంపైనా ప్రభుత్వానికి శ్రద్ధలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.
Modi Govt PR Rahul Gandhi
రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయిందని గుర్తు చేసిన రాహుల్.. దానికి విరుగుడుగా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ఉక్రెయిన్‌లో విద్యార్థులు చిక్కుకుపోయారని అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించారు. మోదీ సర్కారు అంటే పీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
Rupee falling Congress
మరో కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ సైతం రూపాయి పతనంపై ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 76.96కు చేరిందని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో.. రూపాయి ఐసీయూలో ఉందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారని.. ఇప్పుడు రూపాయి వెంటిలేటర్‌పై ఉండి ఆక్సిజన్ కోసం వేచిచూస్తోందని ట్వీట్ చేశారు.
గతేడాది అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2 లక్షల కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారని మరో ట్వీట్లో చెప్పారు. ఇన్వెస్టర్లందరూ ఎగ్జిట్ డోర్‌ను చూస్తుంటే మోదీ మాత్రం.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'- పుతిన్‌కు మోదీ సూచన