Rahul Gandhi On Modi :కుల గణనను నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణన లేకుండా ఓబీసీలకు తగిన భాగస్వామ్యం కల్పించడం సాధ్యం కాదని అన్నారు. ప్రధాని 24 గంటలూ ఓబీసీల గురించి.. వారిని గౌరవించడం గురించి మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు కుల గణనకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తాను కులగణన అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తినప్పుడు.. బీజేపీ ఎంపీలు తన గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
"ఎవరికైనా గాయం అయినప్పుడు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. వారికి ఫ్రాక్చర్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్స్-రే తీయించుకోమని అడుగుతారు. అదేవిధంగా, కుల గణన కూడా ఒక ఎక్స్-రే లాంటిదే. ఇది దేశంలో ఎవరెవరు ఉన్నారు. దేశంలో ఎంత మంది మహిళలు, OBC, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
బీజేపీ- కాంగ్రెస్ మధ్య సిద్ధాంతాల విషయంలో పోరు జరుగుతోందని జైపుర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్లో అదానీపై తాను ప్రసంగించినప్పుడే తన లోక్‌సభ సభ్వత్వం రద్దయ్యిందని గాంధీ దుయ్యబట్టారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని.. కానీ అది వాయిదా వేసుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని ఆరోపించారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయవచ్చు. అయితే డీలిమిటేషన్, కొత్త జనాభా లెక్కల సాకుతో 10 ఏళ్లపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు ఈరోజే అమలు చేయాలని కోరుకుంటోంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ