తమిళనాడు అంటే రెండు అక్షరాలు కాదని, 3వేల ఏళ్ల చరిత్ర కలిగినదని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. అది ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథ 'ఉంగళిల్ ఒరువాన్'(మీలో ఒకరు)అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు రాహుల్ గాంధీ. అనంతరం ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తమిళనాడుకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలపై కొత్త ఆలోచనలను ప్రయోగించాలని చూశారని, రాష్ట్రంతో పాటు దేశాన్ని అవమానించారు ఆరోపించారు.
"ప్రస్తుతం జమ్ముకశ్మీర్ ప్రజలు తమను తాము పాలించుకోలేకపోతున్నారు. వారిని గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ అధికారులు పరిపాలిస్తున్నారు. పంజాబ్లో ఏకపక్షంగా 100 కిలోమీటర్ల భూభాగాన్ని బీఎస్ఎఫ్కు ఇచ్చారు. మన విజన్ భిన్నత్వంలో ఏకత్వం అయితే.. వారిది చట్టాల ద్వారా ఏకత్వాన్ని సాధించటం. తమిళనాడు అంటే రెండు అక్షరాలు కాదు. 3వేల ఏళ్ల చరిత్ర. దానిని ప్రధాని అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజలపై కొత్త ఆలోచనలను ప్రయోగించాలని చూసి.. రాష్ట్రంతో పాటు దేశాన్ని అవమానించారు. "