Rahul Gandhi Marriage :వివాహానికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు ఆలోచించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సరదాగా ప్రశ్నించారు రాజస్థాన్‌కు చెందిన కొందరు విద్యార్థినులు. దీంతో పాటు మీ చర్మ సంరక్షణకు మీరు ఏం చేస్తారు? మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? వంటి ప్రశ్నలకు రాహుల్ సమాధానమిచ్చారు. అలాగే మహిళా సాధికారత, కులగణన, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం సహా తదితర అంశాలపై కూడా ఆయన మాట్లాడారు.
కాగా.. రాహుల్ ఇటీవలే రాజస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా జైపుర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థినులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్‌కు పలు సరదా ప్రశ్నలను సంధించారు కాలేజీ స్టూడెంట్స్. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
విద్యార్థులు : మీరు స్మార్ట్‌గా, అందంగా ఉంటారు.. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదు?
రాహుల్ : నా సొంత పనులతో పాటు పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే వివాహం గురించి పెద్దగా ఆలోచించలేదు.
విద్యార్థులు : చర్మ సంరక్షణకు ఏం చేస్తారు?
రాహుల్ :నా ముఖానికి ఎప్పుడూ సబ్బు, క్రీం పూయలేదు. కేవలం నీళ్లతోనే ముఖం కడుగుతాను.
విద్యార్థులు : మీకు ఇష్టమైన ఆహారం ఏంటి?
రాహుల్ :బఠానీలు, కాకర కాయ, బచ్చలికూర తప్ప మిగతావన్ని నాకు ఇష్టమైన ఆహార పదార్థాలే. ఈ మూడు తప్ప మిగతావన్నీ తింటాను.
విద్యార్థులు : మీకిష్టమైన ప్రదేశాలు ఏంటి?
రాహుల్ :నేను ఇప్పటివరకు వెళ్లని ప్రదేశాలే నాకిష్టమైన స్థలాలు. అయితే ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటాను.
విద్యార్థులు : ఒకవేళ రాజకీయ నాయకుడు కాకపోతే ఏమయ్యేవారు?
రాహుల్ :ఈ ప్రశ్నకు జవాబు కాస్త కష్టమే. అయినా సరే నాకు అనేక రంగాల్లో ప్రవేశం ఉంది. ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పగలను. వంట కూడా చాలా బాగా చేస్తాను.
'మహిళలకు డబ్బు గురించి తెలిసి ఉండాలి..'
ఈ సందర్భంగా మహిళా సాధికారత విషయంపై కూడా మాట్లాడారు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్య సంగ్రామంలో మహిళలు చాలా కీలక పాత్ర పోషించారు. పురుషులకంటే వారు తక్కువేమీ కాదు. అలాంటప్పుడు హక్కుల విషయంలో మహిళలు ఎందుకు వెనుక ఉండాలని రాహుల్ ప్రశ్నించారు. అంతేకాకుండా మహిళలకు డబ్బు గురించి కూడా తెలిసి ఉండాలన్నారు.
"మహిళలకు ఉద్యోగం చేస్తున్నా సరే డబ్బు గురించి తెలియకపోతే వృథానే. అదే ఉద్యోగం లేకపోయినా.. డబ్బు విలువను అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు ఈ అంశాలను అర్థం చేసుకోకపోతే.. ఎప్పటికీ ఇతరులపైనే ఆధారపడాల్సి ఉంటుంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
'ఒక్కోసారి అలా మాట్లాడాల్సి వస్తుంది..'
గతంలో తాను ప్రసంగించేటప్పుడు 'ఖతమ్.. టాటా.. బైబై' అన్న మాటలు మీమ్స్ రూపంలో వైరల్‌గా మారిన విషయాన్ని విద్యార్థినులు గుర్తుచేశారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. ఒక్కోసారి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పుడు కూడా ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలంటూ తన టీమ్ తనపై ఒత్తిడి తెస్తోందంటూ.. 'టాటా బైబై' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్-రే' లాంటిది: రాహుల్ గాంధీ
Puducherry Minister Resigns : 'కులవివక్ష, లైంగిక వేధింపులు తట్టుకోలేను'.. మహిళా మంత్రి రాజీనామా