Python Suffered By Constipation :మలబద్దకం సమస్యతో బాధపడుతున్న 13 కేజీల కొండచిలువను మంగళూరుకు చెందిన వైద్యుల బృందం.. మూడు గంటలపాటు చికిత్స చేసి రక్షించింది. మంగళూరుకు చెందిన డాక్టర్లు మేఘనా పెమ్మయ్య, డా. యశస్వీ నరావి, డా.కీర్తన, నఫీసా కౌసర్, సమీక్ష రెడ్డి బృందం పాల్గొని సర్జరీ చేశారు. వైద్యుల బృందంలోని డా. యశస్వీ నరావి ఈటీవీ భారత్‌తో మాట్లాడి చికిత్స గురించి వివరించారు.
"ఇటీవల కధరి ప్రాంతంలో అస్వస్థతతో ఉన్న కొండచిలువ.. స్థానికంగా ఉండే సరీసృపాల రక్షకుడు ధీరజ్ గనీగా కంటపడింది. దీంతో అతడు నాకు ఫోన్ చేసి.. ఎవరో సర్పాన్ని గాయపర్చారని చెప్పాడు. నేను చికిత్స కోసం పామును క్లినిక్‌కు తీసుకురమ్మని చెప్పా. తర్వాత సర్పాన్ని పరిశీలించగా.. అది తీవ్రమైన మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. కొండచిలువ శరీరంలో దాదాపు సగభాగం మలం నిండిపోయింది. ఇక 13 కిలోల సర్పానికి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ చేశాము. ఆ తర్వాత దాదాపు మూడు గంటల పాటు చికిత్స అందించి.. దాని శరీరంలోని మలాన్ని తొలగించాం. ఆ తర్వాత 5 రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచుకొని.. దానికి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ మెడిసిన్ అందించాము" అని డాక్టర్ అన్నారు.
అయితే కొండచిలువల్లో మలబద్దకం సమస్య సాధారణమే అని డా. యశస్వీ తెలిపారు. అయినప్పటికీ తన పదేళ్ల ప్రాక్టీస్‌లో మాత్రం ఇలాంటి సమస్య చూడలేదని డాక్టర్ అన్నారు. ఇక కొండచిలువ పూర్తిగా కోలుకున్నాక.. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.