Punjab Govt Withdraws Security: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్ మాన్ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రాజ్ కుమార్ వెర్కా, భరత్ భూషణ్ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం మాన్ అన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్ వెల్లడించారు.