"పంజాబ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా నేను పోటీకి రెడీ.. కేజ్రీవాల్ సిద్ధమా?
- పంజాబ్ సీఎం చన్నీ
"నా బావపై చన్నీ ప్రభుత్వం పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు చూపించినా.. రాజకీయాల నుంచి తప్పుకుంటా"
- సుఖ్‌బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్
"పాటియాలా కాకుండా అమృత్‌సర్ తూర్పు నుంచి నాపై అమరిందర్ సింగ్ పోటీకి సిద్ధమా? "
- సిద్ధూ, పీసీసీ చీఫ్
Punjab Satirical Politics: దేశానికి వాయువ్య భాగాన ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తీరు ఇలా.. వాడీవేడీగా సాగుతోంది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఇందులో ముందు వరుసలో ఉన్నారు.
ప్రచారాలు, సభలు, నామినేషన్ దాఖలు సందర్భంగా నాయకులు ప్రత్యర్థులకు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పంజాబ్‌లో 'సవాళ్ల' రాజకీయం ఊపందుకుంది.
తారస్థాయికి అప్పటి నుంచే..
Navjot Singh Sidhu Nomination: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనవరి 30న కాంగ్రెస్ ప్రకటించింది. చన్నీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గంతో పాటు, బదౌర్ స్థానంలో కూడా బరిలోకి దిగుతున్నారు. అనంతరం శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిఠియా సైతం తన సిట్టింగ్ స్థానం 'మజిఠా'తో పాటు సిద్ధూకు ప్రత్యర్థిగా అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్రంలో సవాళ్లు- ప్రతి సవాళ్లు తారస్థాయికి చేరాయి.
సీఎం చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్ర్తాలు సంధించారు. ఓటమి భయంతోనే చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు దిల్లీ సీఎం చెప్పుకొచ్చారు.
"మా సర్వే ప్రకారం.. చమ్‌కౌర్ సాహిబ్ నుంచి చన్నీ ఓడిపోతున్నారు"
-కేజ్రీవాల్, ఆప్ అధినేత
ఈ క్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలకు దీటుగా బదిలిచ్చారు పంజాబ్ సీఎం చన్నీ. రాష్ట్రంలో ఏ స్థానం నుంచైనా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే కేజ్రీవాల్ నాపై పోటీ చేసేందుకు సిద్ధమా? అంటూ ఎదురుదాడికి దిగారు చన్నీ.
సిద్ధూ ఛాలెంజ్‌లు..
పంజాబ్ సమకాలిన రాజకీయాల్లో పటిష్టమైన వాగ్ధాటి ఉన్న నేత నవజోత్ సింగ్ సిద్ధూ. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఛాలెంజ్‌లు, సెటైర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ సిద్ధూను గెలవనివ్వనని అమరిందర్ గతంలో ప్రకటించారు.
ఈ క్రమంలో అమృత్‌సర్ తూర్పు స్థానానికి నామినేషన్ వేసే క్రమంలో ఆయన అమరిందర్ సింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆయనను వాడిపడేసిన తూటాగా అభివర్ణించారు.
"అమరిందర్‌కు దమ్ముంటే పాటియాలాను విడిచిపెట్టి.. నాపై పోటీ చేయాలి. అమరిందర్ సింగ్ ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆయన సొంత ఇంజిన్‌ను సీజ్ చేశారు. మరొకదాని నుంచి నల్ల పొగ వస్తుంది. ఇప్పుడు ఆయన బండిని ఎలా నడపగలరు"
-నవజోత్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు
బ్యాడ్మింటన్ సవాల్
Amarinder Singh News: అలాగే అమరిందర్ సింగ్‌కు సిద్ధూ బ్యాడ్మింటన్ సవాల్ విసరడం సంచలనంగా మారింది. 'అమరిందర్ సింగ్ నాతో 30 నిమిషాల పాటు బ్యాడ్మింటన్ ఆడితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా' అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
'అమృత్‌సర్ తూర్పు, మజిఠా స్థానాల నుంచి పోటీ చేస్తున్న శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్‌సింగ్ మజిఠియా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నాపై మాత్రమే పోటీ చేయగలరా? మజిఠా నుంచి తప్పుకునే దమ్ముందా?' అని ఛాలెంజ్ చేశారు సిద్ధూ.
అయితే సిద్ధూ సవాల్‌ను బిక్రమ్‌సింగ్ స్వీకరించడం గమనార్హం. ప్రస్తుతం బిక్రమ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మజిఠా స్థానంలో ఆయన భార్యను బరిలోకి దింపనున్నారు. ఈ ఎన్నికల్లో సిద్ధూను ఢీకొనబోతున్నారు.
అంతేకాదు ప్రత్యర్థులకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ' వారు.. నన్ను చూసి కలలో కూడా భయపడుతున్నారు. నక్కల గుంపు సింహాన్ని వేటాడాలనుకుంటోంది' అంటూ సెటైర్లు వేశారు సిద్ధూ.
రాజకీయాల నుంచి తప్పుకుంటా..
punjab politics 2022: అమృత్‌సర్ తూర్పు నుంచి సిద్ధూకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న మజిఠియా..శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు బావ అవుతారు. బిక్రమ్ సింగ్ డ్రగ్స్ సరఫరా కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రచార వ్యూహంగా మలుచుకుంది. దీంతో బిక్రమ్ సింగ్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగారు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.
'ఎన్‌డీపీఎస్ కేసులో బిక్రమ్ సింగ్‌పై ఎలాంటి ఆధారాలు చూపినా.. రాజకీయాల నుంచి తప్పుకుంటా' అని సవాల్ విసిరారు బాదల్.
వారు రాజకీయ ఏనుగులు అంట..
Kejriwal In Punjab Election: అమృత్‌సర్ తూర్పునుంచి పోటీ చేస్తున్న సిద్ధూ, బిక్రమ్ సింగ్ మధ్య మాటల యుద్ధంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రతిదానికి వాగ్వాదానికి దిగుతున్న వారిని 'రాజకీయ ఏనుగులు' అంటూ అభివర్ణించారు.
ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు తమ అభ్యర్థులను ఉత్తములుగా ప్రచారం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు.
AAP CM Candidate In Punjab: ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌ను.. నిజాయతీపరుడని ప్రతి సభలో చెబుతున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఇలా అనడం ప్రత్యర్థులకు నచ్చడం లేదని ఓ విలేకరి కేజ్రీవాల్‌ను అడగ్గా.. 'ప్రత్యర్థి పార్టీల నాయకులు అవినీతిపరులు కాబట్టి.. వారు నమ్మలేకపోతున్నారు' అంటూ దిల్లీ సీఎం కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు భగవంత్ మాన్. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉందని దుయ్యబట్టారు. సిద్ధూనే అదుపు చేయలేకపోతున్న కాంగ్రెస్.. రాష్ట్రాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి రాజకీయ నాయకుల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అయితే ఈ సవాళ్లు, సెటైర్లు, పంచ్ డైలాగులు ఓటర్లను ఏమేరకు ప్రభావితం చేస్తాయో తెలియాలంటే.. ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇదీ చదవండి:
పంచతంత్రం: పంజాబ్‌లో 'దళితుల' కటాక్షం దక్కేదెవరికి?
పంజాబ్ కీలక నేతల నామినేషన్- 94 ఏళ్ల వయసులో బాదల్ రికార్డు
Amritsar East: సిద్ధూ పంజా విసురుతారా? మజీఠియా షాక్ ఇస్తారా?