తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ అధిష్ఠానంతో అమరిందర్​ భేటీ!

పంజాబ్ కాంగ్రెస్​లో (Punjab congress)​ ఏర్పడ్డ అభిప్రాయభేదాలను పరిష్కరించే దిశగా ఆ రాష్ట్ర సీఎం అమరిందర్​ సింగ్(Amarinder singh).. పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. సిద్ధూకు పార్టీలో కీలక హోదా కట్టబెట్టడం సహా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరిస్తూ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

punjab congress
పంజాబ్ కాంగ్రెస్, అమరిందర్ సింగ్, సోనియా గాంధీ

By

Published : Jul 3, 2021, 5:00 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​లో(Punjab congress) రాజకీయ గిల్లికజ్జాలు కొనసాగుతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్​ సింగ్ (Amarinder singh) పార్టీ హైకమాండ్​తో సమావేశానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్న నవ్​జోత్ సింగ్ సిద్ధూ వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ సమావేశంలో చర్చలు జరగనున్నట్లు అమరిందర్​ సన్నిహితులు తెలిపారు. అయితే, సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

గతవారమే నవ్​జోత్ సింగ్ సిద్ధూ(navjot singh sidhu).. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీలో పరిస్థితులపై సిద్ధూ తన అభిప్రాయాలను కాంగ్రెస్ నాయకత్వానికి వివరించారు. ఆ సమయంలో అమరిందర్​ దిల్లీలోనే ఉన్నప్పటికీ.. అధిష్ఠానాన్ని కలిసేందుకు అవకాశం రాలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో జరిగే భేటీలో అమరీందర్ తన వాదనను పార్టీ నాయకత్వం ముందుంచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:సీఎంతో భేటీకి నో- సిద్ధూతో మాత్రం సుదీర్ఘ చర్చలు!

పీసీసీ చీఫ్​గా హిందూ నేత!

ప్రస్తుతం పంజాబ్ పీసీసీ చీఫ్​గా ఉన్న సునీల్ జాఖర్​పై వేటు తప్పదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో ఓ హిందూ నేతను నియమించేలా అధిష్ఠానానికి సూచన ఇస్తున్నారు అమరిందర్​ సింగ్. సిద్ధూకు చెక్ పెట్టేందుకే హిందూ నేతను పీసీసీ చీఫ్​గా నియమించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారని సమాచారం. ఈ మేరకు సిద్ధూ.. ప్రియాంకా గాంధీని కలిసిన తర్వాతి రోజే.. పార్టీలోని హిందూ నేతలతో అమరిందర్​ సమావేశమయ్యారు. మంత్రి పదవిలో ఉన్న ఓ నేతతో పాటు కేంద్ర మాజీ మంత్రి, ఓ ఎంపీ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

"సిద్ధూకు పెద్ద బాధ్యతే అప్పగిస్తారు. పార్టీ అధిష్ఠానంతో అమరీందర్ సింగ్ భేటీ అయిన తర్వాత అన్నింటిపై స్పష్టత వస్తుంది. ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులను ఇచ్చేలా అమరిందర్​ చర్చించనున్నారు. అమరిందర్​ సింగ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది."

-పార్టీ వర్గాలు

మరోవైపు, సీనియర్ నేతలు అమరిందర్​ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్​లో సంక్షోభం అమరిందర్​ సింగ్ వర్సెస్ సిద్ధూ కాదని చెబుతున్నారు. సీఎం పనితీరు పట్ల అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్​లో సంక్షోభ పరిస్థితులు.. పార్టీ ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీన్ని పరిష్కరించే దిశగా పార్టీ అధిష్ఠానం ఇదివరకే ముగ్గురు సభ్యుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఈ ప్యానెల్ నివేదిక అందించింది.

ఇదీ చదవండి:పంజాబ్​లో జోరుగా 'పవర్​ పాలిటిక్స్​'

ABOUT THE AUTHOR

...view details