ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తన ప్రధాన సలహాదారుగా చేరినట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ప్రశాంత్ కిశోర్ నియమకానికి ఆమోదించింది. ఈ విషయమై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ప్రశాంత్‌తో కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని ట్వీట్ చేశారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఈ విధమైన చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2017 శాసనసభ ఎన్నికల్లోనూ పంజాబ్‌లో కాంగ్రెస్ వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది ప్రశాంత్ నేతృత్వంలోని రాజకీయ సలహాదారు సంస్థ ఐ-ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ). ఆ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. ప్రశాంత్ ప్రస్తుతం.. బంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు.