Punjab 2022 poll battle: ఆమ్ ఆద్మీ పార్టీ ఓ సంచలనాల పార్టీగా పేరుపొందింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆప్.. తర్వాత భాజపాతో గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, అధికారం నిలబెట్టుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, తర్వాత కొద్ది నెలలకే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి, రెండోసారి అధికారం చేపట్టింది. దిల్లీలో పాగా వేసినప్పటి నుంచే పక్కనున్న పంజాబ్‌పై గురిపెట్టిన ఆమ్ ఆద్మీ.. క్రమంగా అక్కడ బలపడుతూ వచ్చింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తుందని భావించినప్పటికీ నిరాశపర్చింది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉండగా 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెల్చి అధికారం చేపట్టింది. ఆమ్‌ఆద్మీ 20చోట్ల విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు మాత్రమే గెలిచి మూడోస్థానానికి పడిపోయింది. అయితే 2017 ఎన్నికల తర్వాత పంజాబ్ ప్రజలు తమపై ఆసక్తిగా ఉన్నారనే విషయాన్ని ఆమ్ ఆద్మీ గ్రహించింది. ఫలితంగా అక్కడ పార్టీ నిర్మాణంపై ఆప్ దృష్టిసారించింది. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది.
బలపడుతూ వచ్చిన శిరోమణి అకాలీదళ్...
పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ సంస్థాగతంగా బలహీనపడుతూ వచ్చింది. భాజపాతో పొత్తు ముగిసిన తర్వాత ఆ పార్టీ ఎవరితో పోరాడుతుందో అర్థం కాకుండా అయింది. రైతు చట్టాలను వ్యతిరేకించి భాజపాతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ రైతులకు దగ్గర కాలేకపోయింది. అటు భాజపాకూ దూరమైంది. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో అకాలీదళ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే..ఆమ్‌ఆద్మీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఐదేళ్ల క్రితం 20 మంది ఎమ్మెల్యేలతో పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్‌ను అధికార కాంగ్రెస్ వదల్లేదు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయినా క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్లకు నమ్మకం కలిగించేలా ప్రయత్నించింది. క్రమంగా బలపడుతూ వచ్చింది. ఇటీవలి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. మొత్తం 14 చోట్ల గెల్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపా 12, కాంగ్రెస్ 8, అకాలీదళ్ ఒక్కచోటే గెలిచాయి.