తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు

దిల్లీలో రైతుల అందోళన 16వ రోజుకు చేరింది. కేంద్రం దిగొచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెబుతున్నారు రైతులు. త్వరలోనే రైల్వే ట్రాక్​లను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతులకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. దిల్లీలో కొందరు వారికి ఉచితంగా భోజన వసతులు కల్పిస్తున్నారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు

By

Published : Dec 11, 2020, 10:54 AM IST

16వ రోజుకు రైతన్నల ఆందోళన

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు 16వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు కర్షకులు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అన్నదాతలు.

కరోనా కల్లోలం...

రైతులు నిరసనలు చేపట్టిన టిక్రి, సింఘు, ఘాజిపూర్​, నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను భారీగా మోహరించింది కేంద్రం. అయితే సింఘు సరిహద్దులో కరోనా కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసు సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది.

సింఘు సరిహద్దు వద్ద బలగాలు
సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసనలు

ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. ఆందోళనల్లో భాగంగా శనివారం దిల్లీ-జైపుర్, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. టోల్​ గేట్ల వద్ద రుసుము కట్టకుండా నిరసన తెలపాలని యావత్​ దేశానికి పిలుపునిచ్చారు. త్వరలో రైల్వే ట్రాక్​లు ముట్టిడిస్తామని స్పష్టం చేశారు.

టిక్రి సరిహద్దులో పరిస్థితి
ఆందోళనలకు సన్నద్ధం

సర్వత్రా మద్దతు...

దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు మద్దతు లభిస్తోంది. అమృత్​సర్​లోని కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు.. 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు.

దిల్లీకి తరలిన మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ
700 ట్రాక్టర్లతో దిల్లీకి రైతులు

16 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్న రైతులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అమృత్​సర్​కు చెందిన ఓ బృందం.. ఘాజీపుర్​ సరిహద్దు వద్ద ఉన్న రైతులకు భోజనం ఏర్పాట్లు చేస్తోంది. లెక్కలేనంత మందికి ఆహారం కల్పిస్తోంది. ప్రభుత్వం అన్నదాతల మాట వినేంతవరకు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

రైతులకు భోజన వసతులు కల్పిస్తున్న పంజాబ్​ బృందం
ఉచితంగా ఆహార పంపిణీ

ఇదీ చూడండి:-సాగు చట్టాల రద్దుకై రాష్ట్రపతికి విపక్షాల వినతి

ABOUT THE AUTHOR

...view details