ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముండడుగు వేయనుంది. ఉగ్రకార్యకలాపాలపై పటిష్ఠ నిఘా వహించే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్- NATGRIDను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం ఇలాంటి పటిష్ఠ నిఘా వ్యవస్థ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ గ్రిడ్ ద్వారా ముష్కరుల కదలికలను పసిగట్టి.. ఉగ్రదాడులను నియంత్రించవచ్చు. ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు దీని ద్వారా తెలుస్తాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ఈనెల 4న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 51 వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు షా. కరోనా రాకపోయి ఉంటే నాట్‌గ్రిడ్‌ను ఇప్పటికే ప్రధాని దేశానికి అంకితం చేసేవారని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఏంటీ నాట్‌గ్రిడ్?
నాట్గ్రిడ్లో వలసలు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డు వినియోగం, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన- రైల్వే సర్వీసు సహా ఇతర నిఘా వ్యవస్థకు సంబంధించిన డేటా ఉంటుంది. తొలిదశలో 10 యూజర్ ఏజెన్సీలు(ఐబీ, సీబీఐ వంటివి), 21 సర్వీసు ప్రొవైడర్లు ఈ గ్రిడ్‌తో అనుసంధానమవుతారు. మరో దశలో 950 సంస్థలు, రానున్న సంవత్సరాల్లో 1000 కంపెనీలు గ్రిడ్‌లో భాగమవుతాయి.