సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆకస్మిక తరలింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. సుడాన్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్, వైమానిక, నౌకా దళాధిపతులు, రక్షణ శాఖ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. సూడాన్‌లో తాజా పరిణామాలను అధికారులు మోదీకి నివేదించారు. సూడాన్‌లో ఉన్న 4,000 మంది భారతీయలు భద్రతపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
భారతీయుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సుడాన్ పొరుగు దేశాలతోనూ టచ్‌లో ఉండాలని అధికారులకు సూచించారు. సుడాన్‌లో కేరళ వాసి మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేశారు. సుడాన్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు ఇటీవల విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులను తరలించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని పేర్కొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైలెవెల్ మీటింగ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, ఉన్నతాధికారులు అంతకుముందు.. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు. సుడాన్‌లో ఇరు పక్షాల కాల్పుల విరమణ కోసం దౌత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 'సూడాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. భారతీయుల రక్షణ, వారి భద్రతపై దృష్టి పెట్టాం. వారిని అక్కడి నుంచి తరలించే సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేస్తున్నాం' అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, సూడాన్‌లోని భారతీయులు అక్కడి భారత ఎంబసీకి వెళ్లొద్దని కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసింది.
సుడాన్ అంతర్యుద్ధం.. నేపథ్యం ఇదే
సూడాన్‌లోని పారామిలిటరీ యూనిట్ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ కారణంగా సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు నెలకొన్నాయి. అవి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరి.. గత కొద్ది రోజులుగా సైన్యానికి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య సాయుధ పోరాటం జరుగుతోంది.
ఈ ఘర్షణల్లో వందలమంది పౌరులు, సైనికులు మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ రెండు వర్గాల మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుపుతున్నా.. అవి కొలిక్కి రావడం లేదు. ఈ కారణంగా సుడాన్ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4000 మంది భారతీయుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే ఓ భారతీయుడు సహా 300 మంది మృతి చెందారు. ఈ క్రమంలో తమ పౌరులను స్వదేశాలకు తరలించేందుకు వివిధ దేశాలు ముందుకు వస్తున్నాయి. కానీ, ఎయిర్‌పోర్టులే యుద్ధ క్షేత్రాలుగా మారడం వల్ల తరలింపు సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.