Prashant Kishor on One Nation One Election : సదుద్దేశంతో సంస్కరణలు చేపడితే.. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' విధానంతో దేశానికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు రాజకీయ విశ్లేషకుడు, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్. 2024లో సార్వత్రిక సమరం జరగాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తోందన్న ఊహాగానాల మధ్య బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు పీకే.
"సరైన ఉద్దేశాలతో, 4-5 సంవత్సరాల కాలవ్యవధితో ఆ పని(జమిలి ఎన్నికల సంస్కరణలు) చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రభావం 17-18 ఏళ్లపాటు ఉంటుంది. విశాలమైన భారత దేశంలో ప్రస్తుతం ఏటా 25శాతం జనాభా ఏదో ఒకరకంగా ఎన్నికల్లో పాల్గొంటుంది. కాబట్టి.. ప్రభుత్వాన్ని నడపాల్సిన వారు ఈ ఎన్నికల చక్రంలోనే తీరిక లేకుండా ఉంటున్నారు. ఇది(ఎన్నికలను) 1-2సార్లకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఖర్చులు తగ్గుతాయి. ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది." అని వివరించారు ప్రశాంత్ కిశోర్.
అలా చేస్తే ఇబ్బందులే..
అయితే.. జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం హడావుడిగా సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పీకే. "రాత్రికి రాత్రే ఎన్నికల పద్ధతిని మార్చాలని యత్నిస్తే సమస్యలు వస్తాయి. ప్రభుత్వం ఇందుకోసం బిల్లు తెస్తున్నట్టుంది. ఆ బిల్లు వచ్చాక చూద్దాం. ప్రభుత్వానికి సదుద్దేశాలు ఉంటే.. ఎన్నికల విధానంలో మార్పు రావాలి. అప్పుడు దేశానికి మంచి జరుగుతుంది. అయితే.. ఇదంతా ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో బిల్లు తెస్తుందనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది." అని అన్నారు ప్రశాంత్ కిశోర్.