దేశ ఉత్తర సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నెగెవ్ ఎన్‌జీ-7 అనే అధునాతన తేలికపాటి మర తుపాకులు (ఎల్‌ఎంజీ) నేడు వీరి చేతికి అందనున్నాయి. సైనికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇన్సాస్ ఎల్‌ఎంజీ తుపాకుల స్థానంలో ఇవి ప్రవేశిస్తాయి.
ఎన్‌జీ-7 చాలా శక్తిమంతమైన తుపాకీ. ఇన్సాస్.. 5.56×45 ఎంఎం తూటాలను ప్రయోగిస్తుంది. ఎన్‌జీ-7 నుంచి మరింత శక్తిమంతమైన 7.62×51 ఎంఎం తూటాలు వెలువడతాయి. ఇన్సాస్‌కు తూటా అర (మ్యాగజైన్) ద్వారా బులెట్లను సరఫరా చేయాలి. అందువల్ల కాల్పుల సమయంలో ఈ అరలను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. అందుకు భిన్నంగా ఎన్‌జీ-7కు బెల్టులా తూటాలను అందించొచ్చు. ఫలితంగా ఇది అప్రతిహతంగా బులెట్ల వాన కురిపించగలదు. ఆటోమేటిక్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏకంగా నిమిషానికి 700 తూటాలను ప్రయోగించగలదు. వీటి కచ్చితత్వం కూడా ఎక్కువే. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలవు. ఈ తుపాకీ బరువు 7.5 కిలోలు. దీన్ని వాహనాలు, హెలికాప్టర్లు, యుద్ధనౌకలకూ అమర్చవచ్చు. అత్యవసర కొనుగోలు ప్రక్రియ కింద ఎన్‌జీ-7 ఎల్‌ఎంజీలను భారత్ సమీకరించింది.