తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి - బంగాల్​ హింస

Poll violence in Mathabhanga, 4 died; ec seeks report
ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి

By

Published : Apr 10, 2021, 11:32 AM IST

Updated : Apr 10, 2021, 2:37 PM IST

11:29 April 10

ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి

బంగాల్​లో నాలుగో విడత పోలింగ్​ జరగుతున్న వేళ​ కూచ్​బెహార్​ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్​ఎఫ్​ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీతల్​​కుచి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తమ రైఫిళ్లను లాక్కునేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. 

"ఈ ప్రాంతంలో గొడవ జరిగింది. బలగాల చేతుల్లో ఉన్న రైఫిళ్లను లాక్కునేందుకు స్థానికులు యత్నించారు. దాంతో  ఆత్మ రక్షణ చర్యగా కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. "

- సీనియర్ పోలీస్​ అధికారి.  

ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర బలగాల సిబ్బంది తమ పరిధుల్ని దాటి వ్యవహరిస్తున్నారని టీఎంసీ నేత డోలా సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూచ్​బెహార్​ జిల్లాలో రెండు సార్లు కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని చెప్పారు. 

" కేంద్ర బలగాలు రెండుసార్లు కాల్పులు జరిపాయి. మాథబంగా బ్లాక్​ 1లో జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. సీతల్​కుచి బ్లాక్​లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ప్రజలకు కేంద్ర బలగాల సిబ్బంది అన్యాయం చేస్తున్నాయి. తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేవనెత్తితే.. ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది."   

-డోలా సేన్​, టీఎంసీ నేత

కూచ్​బెహార్​లో జరిగిన కాల్పుల ఘటనపై సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ దళం(సీఆర్​పీఎఫ్​) స్పందించింది. తమ సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ఎవరూ ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో మోహరించలేదని స్పష్టం చేసింది. 

తొలిసారి ఓటరు హత్య- భాజపా, టీఎంసీ ఘర్షణ

అంతకుముందు సీతల్​​కుచిలోని ఓ పోలింగ్​ బూత్​ ముందే ఓటరును కాల్చి చంపారు దుండగులు. ఈ హత్య భాజపా పనేనని టీఎంసీ ఆరోపించింది. మృతి చెందింది తమ కార్యకర్తేనని.. అధికార పార్టీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని భాజపా ఆరోపించింది. 

మృతి చెందిన యువకుడు ఆనంద్​ బుర్మన్ మృతదేహాన్ని పతంతులి పోలింగ్​ బూత్​ 85 నుంచి బయటకు తీసుకువచ్చామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. పోలింగ్​ బూత్​ బయట కార్యకర్తలు బాంబులు విసురుకున్నారని.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్​ జరిపాయని వెల్లడించారు.

లాకెట్​ ఛటర్జీ కారుపై దాడి

హూగ్లీ ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా నేత లాకెట్​ ఛటర్జీ కారుపై దాడి చేశారు స్థానికులు. కారును అడ్డుకునే క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఇదే ప్రాంతంలో ఎన్నికల కవరేజీకి వెళ్లిన ఓ మీడియా వాహనాలపైనా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.  

Last Updated : Apr 10, 2021, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details