Birthday Wishes to Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నాయకుడిగా.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైనే తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కకడ సేవా కార్యక్రమాలు, బాణాసంచా కాల్చి తమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన జన్మదిన శుభాకాంక్షలను ట్వీట్ల ద్వారా తెలుపుతున్నారు.
మీ కోరిక తీరాలి నాన్న:ఈ నేపథ్యంలో ఆ అధినేత వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో లోకేశ్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తెలుగు ప్రజల జీవితాలు మార్చడానికి ఎంత కష్టపడుతున్నారో తనకు తెలుసంటూ లోకేశ్ అన్నారు. పేదరికం లేని సమాజం స్థాపించాలని మీరు చేసే కృషి నిరుపమానం అన్నారు. ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థ అందించేందుకు కృషి చేస్తున్నారని లోకేశ్ కొనియాడారు. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే మీ తపన తీరాలని.. తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలనే మీ కోరిక తీరాలి నాన్న అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. లోకేశ్ ట్వీట్ పట్ల చంద్రబాబు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ట్వీట్లు పెడుతున్నారు.