Political Parties Focus on LB Nagar Constituency :రాష్ట్ర రాజధానికి స్వాగతం పలుకుతూ నగర శివారులో విస్తరించి ఉన్న నియోజకవర్గం.. ఎల్బీనగర్. 11 డివిజన్లతో హయత్ నగర్, వనస్థలిపురం, లింగోజిగూడ, గడ్డిఅన్నారం, బీఎన్ రెడ్డినగర్, హస్తినాపురం, నాగోల్, మన్సూరాబాద్ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎల్బీనగర్ ఓటరు అంచనాలకు అందని తీర్పులతో అభ్యర్థులను అయోమయంలో పడేస్తారు. ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సామరంగారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరేకాక మరో 45 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు ఎల్బీనగర్ బరిలో నిలబడ్డారు.
Political Parties Election Campaign 2023 :ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. లక్ష మందికి పైగా ఉన్న తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. విజయావకాశాలు ఆ ఓటర్ల వారిదే విజయం. ఎల్బీనగర్కు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాదికి చెందిన వారూ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారందరూ ఓటేస్తారా..? లేక తటస్థంగా ఉంటారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.
ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
Telangana Assembly Elections 2023 :చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, గడ్డి అన్నారం, చంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పోటీ లేకపోవడంతో సెటిలర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ధీమాలో ఆ పార్టీ అభ్యర్థి మధుయాస్కీ ఉన్నారు. తుమ్మల నాగేశ్వర్రావు లాంటి సీనియర్లను రంగంలోకి దింపి కమ్మ సామాజిక వర్గం నేతలతో మంతనాలు సాగించారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.