Bhuma Akhila Priya in Arrest: నంద్యాలలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలోని తన నివాసంలో అఖిలప్రియ అరెస్టు చేసి.. పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేశారు. అఖిలప్రియను పోలీసులు పాణ్యం నుంచి నంద్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఆమె భర్తతో పాటు మరో ఇద్దరిని కర్నూలు జైలుకు తరలించారు.
ఉదయం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆళ్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి చేరుకున్నాయి. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి నేరుగా అఖిలప్రియ ఇంటి లోపలికి వెళ్లి కేసు వివరాలను తెలియజేసి అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. భూమా అఖిలప్రియ తన సొంత వాహనంలో కూర్చున్నాక పోలీసులు బందోబస్తు నడుమ నంద్యాలకు తీసుకొని వెళ్లారు.
భూమా అఖిల ప్రియ అనుచరులు అరెస్ట్: కొత్తపల్లి గ్రామం వద్ద టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వేకువజామునే నంద్యాల నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం.. ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్దకు వెళ్లింది. ఒక్కసారిగా అఖిలప్రియ నివాసంలోకి వెళ్లి.. దాడి చేసిన నిందితులుగా అనుమానిస్తున్న భూమా అనుచరులను అదుపులకు తీసుకొని.. వాహనాల్లోకి ఎక్కించారు. దాదాపు ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు వీరిని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది.
అసలేెం జరిగింది:నంద్యాల జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తపల్లి వద్దకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గీయులు లోకేశ్ ఎదుటే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. అఖిలప్రియ దగ్గరుండి దాడి చేయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అయ్యాయి. ఇప్పటికే నంద్యాల జిల్లాలో వీరివురి వర్గీయుల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అవి మరోసారి బయటపడ్డాయి. నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మరో నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు.అనంతరం లోకేశ్‌ను కలిసి వెళుతున్న ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ అనుచరులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని వేరే వాహనం ఎక్కించి పంపించారు. లోకేశ్ పాదయాత్రలో తమ బలాన్ని చూపించుకోవడానికే భూమా అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు.
ఇవీ చదవండి: