దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ తరహా కేసు మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్(17).. నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తె మృతదేహానికి పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు బాధితురాలి తండ్రి, మామయ్య ప్రయత్నించారని బాలిక తల్లి తెలిపారు. ఇందుకు పోలీసులు అనుమతించలేదని పేర్కొన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లారని ఆరోపించారు. తమ ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. పోలీసులే బలవంతంగా తమ సంతకం తీసుకున్నారని అన్నారు. తమను వాహనంలో తీసుకెళ్లారని చెప్పారు.
అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సమర్థించుకున్నారు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన నేపథ్యంలో మృతురాలి అంత్యక్రియలను పర్యవేక్షించే బాధ్యత పోలీసులదేనని అదనపు ఎస్పీ రాంస్నేహి మిశ్రా పేర్కొన్నారు. అందువల్లే పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శాంతి, భద్రతలు చేయి దాటకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు.