PM Rojgar Mela Today :భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిబాటలో పయనిస్తోందని.. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్, ఫార్మా, పర్యటక రంగాలు.. భవిష్యత్తులో శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దాని వల్ల యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు.
'2030 నాటికి 14కోట్ల ఉద్యోగాలు'
PM Modi Rojgar Mela : దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో సోమవారం జరిగిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికైన 51వేలకు పైగా ఉద్యోగులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు పర్యటక రంగమే రూ.20 లక్షల కోట్లు అందించి దోహదపడుతుందని.. 14 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని మోదీ తెలిపారు.
"ఈ దశాబ్దంలో ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించి సామాన్యులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు సిద్ధమైంది. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను పూర్తి బాధ్యతతో పనిచేస్తాను. దేశంలోప్రతి రంగం అభివృద్ధి చెందాలి. ఆహారం నుంచి ఫార్మా వరకు.. అంతరిక్షం నుంచి స్టార్టప్‌ల వరకు.. ప్రతి రంగం పురోగమిస్తేనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి