Central Cabinet Meeting Today : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సోమవారం భేటీ అయ్యింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో ఈ సమావేశం జరిగింది. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్టు ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, ఈ కీలక భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని.. వచ్చే తొమ్మిది నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు.
'యుద్ధం వచ్చినా నిలదొక్కుకునేలా..'
వేగంగా అభివృద్ధి సాధించాలంటే మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ అభిప్రాయపడ్డారు. యుద్ధాల్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకొనేలా బలంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని దేశం సాధించిన అభివృద్ధిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్, ఇస్రో చైర్మన్ కూడా పాల్గొన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి ఎలా ఉండాలన్న అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎలాంటి శక్తిగా అవతరిస్తుందన్న అంశాన్ని వివరిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. మూలధన వ్యయం, మౌలిక వసతుల కల్పన గురించి వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి కూడా మోదీ పర్యటన, ఇతర అంతర్జాతీయ అంశాల గురించి వివరించారు. ప్రధాని మోదీ తాజాగా చేసిన అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ఎలా విజయవంతమయ్యాయో చెప్పారు.