PM Modi Varanasi Cricket Stadium :దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం గమనార్హమే.
స్టేడియం 'మహాదేవ్'కు అంకితం..
'మహాదేవ్' నగరంలోని ఈ స్టేడియం ఆయనకే అంకితం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 'కాశీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించడం ద్వారా ఇక్కడి క్రీడాకారులకు మేలు జరుగుతుంది. పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం స్టార్ అవుతుంది. ఈరోజు నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు. క్రీడల పట్ల ప్రజలకు ఉన్న దృక్పథంలో వచ్చిన మార్పే భారత్ సాధించిన విజయానికి నిదర్శనం. ఒలింపిక్ పోడియం స్కీమ్- టాప్స్ (TOPS) వంటి పథకాలతో క్రీడాకారులకు ప్రతి స్థాయిలో ప్రభుత్వం సహాయం చేస్తోంది' అని మోదీ వివరించారు.
స్టేడియం విశేషాలు..
- ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు.
- త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు.
- గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది.
- స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
- పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది.
- సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.
- ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది.
- స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది.
- ఈ స్టేడియం నిర్మాణం పూర్తి అయితే కాన్పుర్, లఖ్‌నవూల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడో అంతర్జాతీయ స్టేడియం కానుంది.
-
వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్‌కు సమీపంలో నిర్మించునున్న ఈ స్టేడియం 2025 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.