hanuman statue in morbi: హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొన్నేళ్లుగా షిమ్లాలో ఇలాంటి భారీ విగ్రహాన్ని చూస్తున్నామని, ప్రస్తుతం రెండోది మోర్బీలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే రామేశ్వరం, బంగాల్లో మరో రెండు భారీ హనుమాన్ విగ్రహాలు నిర్మించనున్నట్లు చెప్పారు.
"దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో రామ కథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏ భాష అయినా.. రామ కథ స్ఫూర్తి అందరిని ఒక్కటి చేస్తుంది. అది దైవత్వానికి చేరువ చేస్తుంది. ఇదే భారత దేశ నమ్మకం, ఆధ్యాత్మికత, సంప్రదాయం, సంస్కృతికి బలం. చెడుపై మంచి విజయం సాధించేందుకు రాముడు విశేషంగా కృషి చేశారు. అందుకోసం అందరిని కలుపుకొని వెళ్తూ, సమాజంలోని ప్రతి వర్గంలోని ప్రజలను అనుసంధానిస్తూ చెడుపై విజయం సాధించారు. అదే విధంగా అందరి ప్రయత్నాలు ఉండాలి. భారత్ ప్రస్తుత తరుణంలో స్తబ్దుగా ఉండిపోవలనుకోవట్లేదు. ఉన్నచోటే ఉంటే ముందుకు సాగలేం. ప్రపంచం మొత్తం ఆత్మనిర్భరత గురించే ఆలోచిస్తోంది. స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేసేలా దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని ఆధ్యాత్మికవేత్తలను కోరుతున్నా. మనం ఇంట్లో మన ప్రజలు చేసిన వస్తువులనే వాడాలి. దీని వల్ల ఉపాధి పొందేవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఓసారి ఊహించండి. స్థానిక ఉత్పత్తులనే వినియోగిస్తే వచ్చే 25 ఏళ్లలో నిరుద్యోగమనేదే ఉండదు. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.