PM Modi Quad summit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్‌లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపింది.
Quad summit Japan: ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పాటు, పరస్పర ప్రయోజనకరమైన ప్రపంచ సమస్యలపై నేతలు చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. 'క్వాడ్ తరఫున చేపట్టిన కార్యక్రమాల పురోగతిని నేతలు సమీక్షించనున్నారు. నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. బైడెన్ సర్కారు రూపొందించిన ఇండో పసిఫిక్ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌పై భారత్ పరిశీలన జరుపుతోంద'ని బాగ్చి పేర్కొన్నారు.