జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్‌లోన్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశం అజెండా ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి గుప్కార్ కూటమి ప్రధాన డిమాండ్లు.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే విషయంపై ప్రాధాన్యం సంతరించుకుంది.
కూటమి వెనక్కి తగ్గుతుందా?
ఆర్టికల్ 370, ప్రత్యేక హోదాల పునరుద్ధరణకు సంబంధించి వెనక్కి తగ్గేది లేదని గుప్కార్ ఇదివరకు ఉద్ఘాటించినా.. చర్చలపై కేంద్రం ప్రకటన చేసిన తర్వాత వారిలో మార్పు వచ్చింది. 'కశ్మీర్లో ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తే చాలు' అనుకునే పరిస్థితిలో నేతలు ఉన్నారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత 4జీ ఇంటర్నెట్ పునరుద్ధరణపైనే ఎక్కువగా మాట్లాడారు.
అయితే, ఒమర్ తండ్రి.. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మాత్రం మోదీ సర్కారుకు కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. డిమాండ్లను నెరవేర్చకుండా ఇతర పరిష్కారాలను ప్రతిపాదించడం కేంద్రానికి కత్తిమీద సామే.