అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ టీవీ కార్యక్రమం ద్వారా సోమవారం ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగా కరోనా, దాని పర్యవసానాలపై ప్రధానంగా మోదీ మాట్లాడుతారని ఆయూష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దూరదర్శన్ టీవీ ఛానెళ్లలో ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ఆయూష్ సహాయ మంత్రి కిరెన్ రిజిజు కూడా మాట్లాడనున్నారు. అలాగే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా యోగా సాధన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆయుష్ శాఖ ప్రకటించింది.
కరోనా వేళ జరగనున్న ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని.. 'ఆరోగ్యం కోసం యోగా(యోగా ఫర్ వెల్నెస్)' ఇతివృత్తంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ పలు డిజిటల్ కార్యక్రమాల ద్వారా 1,000 ఇతర సంస్థలతో ప్రజలకు యోగా సాధన అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయూష్ శాఖ పేర్కొంది.
2015 నుంచి ఏటా జూన్ 21న యోగా డేను నిర్వహిస్తున్నారు. విదేశాలలో ఉన్న భారత సంస్థలు ఆయా దేశాల్లో యోగా కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నాయి. ఈ సారి ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకోనున్నట్లు ఓ ప్రకటనలో ఆయూష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా భారీ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొనే అవకాశముందని పేర్కొంది.