PM Modi Speech on Independence Day : లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు.. దేశ యువతకు సహాయకారిగా ఉంటున్నాయని వివరించారు. కేంద్ర పథకాలకు యువశక్తి తోడై.. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అగ్రిటెక్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ.. స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేసేందుకు లాఖ్‌పతి-దీదీ పథకం తేనున్నట్లు ప్రకటించారు.
"గ్రామాల్లో 2 కోట్ల మంది మహిళా లక్షలాధికారులను తయారు చేయడమే నా కల. భారత వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం రావాలి. అగ్రిటెక్ బలోపేతమవ్వాలి. ఇందుకోసం స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకు మేము శిక్షణ ఇస్తాం. డ్రోన్ నడపడానికి, డ్రోన్లను మరమ్మత్తు చేయడానికి మేము శిక్షణ ఇస్తాం. వేలాదిగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలకు భారత ప్రభుత్వం డ్రోన్లను సమకూరుస్తుంది. శిక్షణ ఇస్తుంది. మన వ్యవసాయ రంగంలో డ్రోన్ల సేవలు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇందుకోసం 15 వేల స్వయం సహాయక బృందాల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తాం."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఎర్రకోట సాక్షిగా మరో రెండు పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి.. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారమే లక్ష్యంగా తీసుకువస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం.. విశ్వకర్మ యోజనను వచ్చే నెల నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
"నా పాలనలో కేవలం ఐదేళ్ల వ్యవధిలో 13.5 కోట్ల మంది పేదరికం సంకెళ్లను తెంచుకుని కొత్తగా మధ్యతరగతిలో ప్రవేశించారు. జీవితంలో ఇంతకంటే మించిన సంతోషం ఉండదు. ఈసారి విశ్వకర్మ జయంతినాడు 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలతో తరతరాలుగా చేతి వృత్తులు చేసుకుని జీవిస్తున్న కార్మికులు, స్వర్ణకారులు, బట్టలు ఉతికేవారు, జుత్తు కత్తిరించేవారు, ఇలాంటి వారికి చేయూతను ఇచ్చేందుకు రానున్న నెలలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని విశ్వకర్మ పథకాన్ని తీసుకొస్తున్నాం. ఆరంభంలో దీనికి 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి