PM Modi Speech in BJP Public Meeting at Maheshwaram : తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని.. ఇక్కడి ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. బీఆర్‌ఎస్ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని.. బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీ(Congress Party)లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో(Telangana Elections) బీఆర్‌ఎస్‌ను దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీలలో ప్రజలు తిప్పికొట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే బీఆర్‌ఎస్‌కు వేయడమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని చెప్పారు. కానీ బీజేపీ అలాకాదు.. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమంటూ.. మహేశ్వరం ప్రజలకు తెలిపారు.
PM Modi Telangana Election Campaign : బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు స్వార్థ పార్టీలని.. సమాజ విరోధులు అని పీఎం మోదీ ధ్వజమెత్తారు. మోదీని తిట్టడమంటే కేసీఆర్‌కు మహాఇష్టం.. ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం(BC CM BJP Slogan) అవుతారని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని.. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని విమర్శలు చేశారు.