modi putin meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య నేడు (సోమవారం) ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సదస్సు ఈ సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనుంది. రాత్రి తొమిదిన్నర గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయి 2+2 తొలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో అఫ్గానిస్థాన్ పరిస్థితులపై దృష్టి సారించటం సహా లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ల నుంచి పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై చర్చించనున్నారు. ఈ సదస్సు తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సీమాంతర ఉగ్రవాదం, అఫ్ఘాన్ సంక్షోభంతో ఏర్పడే భద్రతా సమస్యలను సంయుక్త ప్రకటనలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.